contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పిఠాపురం వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వర్మ తీరుపై అసంతృప్తి!

కాకినాడ జిల్లా పిఠాపురంలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన నేతల మధ్య చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంపై ప్రారంభమైన వివాదం తోపులాట వరకు దారితీయడంపై ఆయన సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలు కూటమి ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

మంగళవారం పిఠాపురంలో నిర్వహించిన ‘పాడా’ (పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) సమావేశం సందర్భంగా ఈ వివాదం చెలరేగింది. కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫొటో లేకపోవడంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో జనసేన నేత పెండెం దొరబాబు కలుగజేసుకోవడంతో ఇరువర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారి, తోపులాటకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సీఎం చంద్రబాబు స్పందించినట్లు తెలిసింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా వర్మ ప్రవర్తనను ఆయన తప్పుబట్టినట్లు సమాచారం. ఫొటోలు, ప్రోటోకాల్ వంటి చిన్న విషయాల కోసం బహిరంగంగా ఘర్షణలకు దిగడం తగదని హితవు పలికారు. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని, కానీ వీధుల్లో గొడవపడటం సరైన పద్ధతి కాదని స్పష్టం చేసినట్లు తెలిసింది.

కూటమి ప్రభుత్వంలో పార్టీల మధ్య క్రమశిక్షణ అత్యంత కీలకమని చంద్రబాబు నొక్కిచెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వివాదం మరింత ముదరకముందే దానికి ముగింపు పలకాలని అధిష్ఠానం కసరత్తు ప్రారంభించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :