కరీంనగర్ రూరల్ డివిజన్ పరిధిలోని నుస్తులపూర్ సబ్‌డివిజన్, గన్నేరువరం సెక్షన్‌లోని గుండ్లపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు గురువారం “పల్లెబాట” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు విద్యుత్ వినియోగంపై పలు కీలక సూచనలు అందించారు.
విద్యుత్ వినియోగదారులు నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు ఉపయోగించాలని అధికారులు సూచించారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా ఫ్రిజ్‌లు, కూలర్లు వంటి గృహోపకరణాలకు ప్రత్యేకంగా ఎర్తింగ్ చేయించుకోవాలని తెలిపారు. సరైన ఎర్తింగ్ ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అవగాహన కల్పించారు.
ఇంటి విద్యుత్ వ్యవస్థలో నాణ్యమైన సర్వీస్ వైరు, డీపీ మెయిన్ స్విచ్ ఫ్యూజ్ ఏర్పాటు చేయడం కూడా అత్యంత అవసరమని వివరించారు. అదనంగా, విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు లేదా సమస్యలు ఎదురైనప్పుడు టోల్‌ఫ్రీ నెంబర్ 1912కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఈ ఉపేందర్, గన్నేరువరం ఏఈ ఆంజనేయులు, స్థానిక రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాల్లో విద్యుత్ భద్రతపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.








