అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ జెడ్ జోగంపేట గ్రామంలో గిరిజనులు విద్యుత్ అధికారుల తీరు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “మా ఇంటికి కరెంటు కనెక్షన్ పీకేస్తున్నారు” అంటూ కాగడాలు పట్టుకొని గ్రామంలో వినూత్నంగా ప్రదర్శన, ధర్నా నిర్వహించారు.
గ్రామంలో సుమారు 60 గిరిజన కుటుంబాలు, ముఖ్యంగా కొండదొర తెగకు చెందిన వారు నివసిస్తున్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించినప్పటికీ, తాము 100 యూనిట్ల లోపే వినియోగిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. అయినప్పటికీ అధిక మొత్తంలో బిల్లులు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
గ్రామానికి చెందిన కోట రాజబాబు (సర్వీస్ నెంబర్: 115654G375000018) ఉదాహరణగా చూపిస్తూ, యావరేజ్ వినియోగం 39 యూనిట్లు ఉన్నప్పటికీ, ఒక నెలలో 71 యూనిట్లు వినియోగించినట్లు చూపించి రూ. 9,844.80 బిల్లు విధించారని తెలిపారు. ఈ విధంగా సుమారు 40 కుటుంబాలకు అధిక బిల్లులు వచ్చాయని గిరిజనులు ఆరోపించారు.
బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామని హెచ్చరించిన అధికారులు, ఇప్పటికే గ్రామంలో 20 కుటుంబాల విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. దీంతో టార్చ్‌లైట్ వెలుగులో వంట చేసుకుంటూ, చీకట్లో జీవనం సాగించాల్సి వస్తోందని వాపోయారు. రాత్రివేళ దోమల సమస్యతో చిన్నపిల్లలు నిద్రపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లిస్తామని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ నెల 23న రాంబిల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించినప్పటికీ, గ్రామస్థాయిలో ఆ హామీలు అమలు కావడం లేదని విమర్శించారు.
ఇంటి విద్యుత్ కనెక్షన్లను వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే సీఎండీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి. చంద్రయ్య, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








