కాకినాడ : మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న వేళ, భవిష్యత్తులో కాకినాడ నగరం, జిల్లా పరివాహక ప్రాంతాలకు కృత్రిమ వరద ముప్పు పొంచి ఉందని పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఉప్పుటేరు (సాల్ట్ క్రీక్), ఏలేరు కాలువలపై ఉన్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది.
పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన కాలంలో సుమారు 150 నుంచి 250 మీటర్ల వెడల్పు, 12 అడుగుల లోతుతో ప్రవహించిన సామర్లకోట–కాకినాడ ఉప్పుటేరు ప్రస్తుతం ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడం వల్ల 20 నుంచి 40 మీటర్ల వెడల్పుకు కుంచించుకుపోయిందని తెలిపారు. దాదాపు 70 శాతం మేర ప్రవాహ మార్గం కనుమరుగై లోతు కూడా మూడు అడుగులకు తగ్గిపోయిందని పేర్కొన్నారు. దీంతో ఏలేరు మిగులు నీరు, నగర మురుగునీరు సముద్రంలోకి వెళ్లకుండా వెనక్కి చేరే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సామర్లకోట, పిఠాపురం, కాకినాడ రూరల్ పరిధిలోని ఏలేరు కాలువలు, సుద్దగడ్డ వాగులపై మున్సిపల్ లేదా ఇరిగేషన్ శాఖల అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కాంక్రీట్ వంతెనలు, పైపుల కల్వర్టులు వరద ప్రవాహానికి అడ్డంకిగా మారాయని సంఘం ఆరోపించింది. ఈ నిర్మాణాల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్క మొక్కలు పేరుకుపోవడంతో నీటి ప్రవాహం నిలిచిపోతుందని, ఫలితంగా ప్రతి ఏడాది వందల ఎకరాల పంట భూములు, ప్రధాన రహదారులు, పరిసర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని పేర్కొంది.
వరదలు వచ్చిన తర్వాత హడావుడిగా చర్యలు చేపట్టడం కంటే, ప్రస్తుతం నీటి ప్రవాహం సాధారణంగా ఉన్న సమయంలోనే ఇరిగేషన్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేసి తొలగించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
అలాగే, బ్రిటిష్ సర్వే రికార్డుల ఆధారంగా ఉప్పుటేరు, ఏలేరు కాలువల అసలు సరిహద్దులను గుర్తించేందుకు ప్రతి 100 మీటర్లకు సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసేలా డిజిటల్ సర్వేను జిల్లా యంత్రాంగం వేగవంతం చేయాలని కోరింది.
సామర్లకోట నుంచి కాకినాడ సముద్ర ముఖద్వారం వరకు ఉప్పుటేరులో యుద్ధప్రాతిపదికన భారీ పూడికతీత చేపట్టి, హిటాచీ యంత్రాలతో వెడల్పు చేయడంతో పాటు గుర్రపుడెక్క మొక్కలను వేర్లతో సహా తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
రాబోయే ఆగస్టు–అక్టోబర్ తుఫానుల సీజన్‌కు ముందే ఈ శాశ్వత చర్యలు పూర్తి చేయకపోతే కాకినాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో భారీ ముంపు సంభవించే ప్రమాదం ఉందని సంఘం హెచ్చరించింది. ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల నీరు గోదావరి పాయల ద్వారా సముద్రంలోకి వెళ్తున్నప్పటికీ, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య ఏజెన్సీ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిస్తే ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరే అవకాశం ఉందని సంఘం తెలిపింది. గతంలో మాదిరిగా జలాశయం పూర్తి స్థాయికి చేరుకుని ఒకేసారి అధిక పరిమాణంలో నీటిని విడుదల చేస్తే పిఠాపురం, గొల్లప్రోలు, కిర్లంపూడి, కాకినాడ నగరం, రూరల్ ప్రాంతాల్లో ముంపు ప్రమాదం నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు పూర్తి సామర్థ్యంతో లేకపోయినా, భవిష్యత్తు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.








