contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

‘2034 వరకు నేనే సీఎం’.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్‌ కీలక హామీ

హైదరాబాద్ : విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్న ప్రతిసారీ కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తనపై విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఇకపై ఉపాధ్యాయ సంఘాలు తమ వ్యక్తిగత సమస్యల కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

ఫిన్‌లాండ్, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థలో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మీ సమస్యలు నాకు వదిలేయండి. మీరు అడగకముందే వాటిని పరిష్కరిస్తాను. ప్రమోషన్లు, బదిలీలను కూడా మీ ఇంటి వద్దకే తీసుకొచ్చాం. ఇకపై మీ కోసం కాదు… విద్యార్థుల సమస్యల కోసం నాతో పోరాడండి” అని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సూచించారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కోరారు.

2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఆ కాలంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 55 రోజుల్లో 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని గుర్తు చేస్తూ, ఇలాంటి వేగవంతమైన నియామకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.

రాబోయే ఐదేళ్లలో తెలంగాణ విద్యాశాఖను ప్రపంచ దేశాలు ఆదర్శంగా చూసే స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. పంచవర్ష ప్రణాళిక తరహాలో ఉపాధ్యాయ సంఘాలు సంకల్పంతో పనిచేస్తే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని అన్నారు. దేశానికి విద్య, వైద్య రంగాల్లో తెలంగాణే నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలపై నేరుగా చర్చిస్తానని సీఎం హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన సమయానికి జమ కాకపోయేవని, ప్రస్తుతం ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అదే రోజు వేతనాలు అందజేస్తున్నామని వెల్లడించారు.

విద్యా వ్యవస్థలో నాణ్యత పెంపు, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు అనే మూడు అంశాలపై ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :