తూప్రాన్ డివిజన్: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా నిర్వహణ ఉండాలని ఆర్డీవో జయచంద్రారెడ్డి అధికారులకు సూచించారు.
తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వడ్ల కొనుగోలు కేంద్రంలో తాగునీరు, టెంట్లు, అవసరమైన కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. కేంద్రానికి సంబంధించిన గ్రామ వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, రైతులకు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంచాలని సూచించారు.
వడ్ల కొనుగోలు ప్రక్రియలో తూకం విషయంలో ఎలాంటి తేడాలు ఉండకూడదని, ప్రతి సంచికి సుమారు 40 కిలోల 600 గ్రాములు ఉండేలా ఖచ్చితంగా పరిశీలించాలని పేర్కొన్నారు. కొనుగోలు చేస్తున్న ధాన్యం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సెంటర్ ఇంచార్జ్లకు సూచించారు.
అలాగే తూకం పూర్తైన వెంటనే రైతుల ధాన్య వివరాలను ట్యాబ్లో నమోదు చేయాలని, ఆ ధాన్యాన్ని వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు తరలించి కేంద్రాలు త్వరగా ఖాళీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైస్ మిల్లులు ధాన్యాన్ని స్వీకరించిన వెంటనే OPMS (ఆన్లైన్ పబ్లిక్ మేనేజ్మెంట్ సిస్టమ్)లో ఎంట్రీ చేయాలని మిల్లర్లకు తెలియజేయాలని జీపీవో, ఉప తహసీల్దార్లకు ఆదేశించారు.
సమావేశం అనంతరం రైస్ మిల్ యజమానులతో కూడా ఆర్డీవో సమావేశమై, రైతుల ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా త్వరగా దిగుమతి చేసుకోవాలని కోరారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.








