పార్వతీపురం మన్యం జిల్లా (కొమరాడ): మహాకవి, నోబెల్ బహుమతి గ్రహీత, భారత జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతిని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో గురువారం సేవా కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కొమిరి కృష్ణమూర్తి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
పాలెం పంచాయతీ పరిధిలోని మర్రిగూడ గిరిజన గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది వృద్ధులు, వితంతువులు, నిరుపేద మహిళలకు చీరలు, పంచెలు, తువ్వాళ్లు పంపిణీ చేశారు. సమాజం పట్ల బాధ్యతతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తితో పాటు సత్యసాయి సేవాదళ్ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. రాగాల శ్రీనివాసరావు (మాస్టర్), నల్ల గౌరు నాయుడు, నిమ్మక మహేష్, రాగోలు ప్రసాదరావు, బిడ్డిక మాధవరావు, పొట్నూరు జగన్నాధం, బొండపల్లి వెంకటరమణ, అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడంలో ముందుండే హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తిని మర్రిగూడ గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ గిరిజన గ్రామాలపై మక్కువతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని గ్రామ పెద్దలు కొనియాడారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పేదల సేవలో గడపడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.








