మెదక్ జిల్లా – రామాయంపేట, జూన్ 5 : 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని వన్ యోజన అటవీ పార్కులో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఆమెతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రత్నాకర్ జోహారి, డీఎఫ్‌వో జోజి, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈఈ వేణు, సంబంధిత అటవీ శాఖ అధికారులు, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు యాదగిరి, సర్పంచ్ శర్మ రాజశేఖర్, ఉపసర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. “ఏక్ పెడ్ మా కే నామ్” కార్యక్రమం ద్వారా ప్రతి భారతీయుడు తన తల్లి, భూమాత గౌరవార్థం ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. మాతృత్వంలోని ప్రేమ, త్యాగం, ప్రకృతి యొక్క జీవనాధార శక్తిని అనుసంధానించే ఈ ఉద్యమం మరింత పచ్చని భవిష్యత్తుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
“మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటి, దానిని సంరక్షించి భవిష్యత్తులో వృక్షంగా ఎదిగేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే అటవీ సంపద సంరక్షణ, జీవ వైవిధ్యం పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.
మెదక్ జిల్లాలో 24 శాతం అటవీ సంపద ఉందని పేర్కొన్న కలెక్టర్, నర్సాపూర్, వడియారం, పరికిబండ, మనోహరాబాద్ అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అటవీ ప్రాంతాలకు విద్యార్థులకు ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు చేసి, అటవీ సంపద ప్రాధాన్యతపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో అటవీ సంపద పరిరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడిన కలెక్టర్, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన వాతావరణం అందించేందుకు అడవుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెప్పారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి ప్రజాదరణ పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రత్నాకర్ జోహారి మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మానవాళి మనుగడకు చెట్లు ఎంతో అవసరమని, ప్రకృతి విపత్తుల సమయంలో కూడా చెట్ల ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నం సునామీ సమయంలో చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నష్టం తక్కువగా నమోదైందని గుర్తుచేశారు.
గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖల సమన్వయంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








