అనకాపల్లి :అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని కళ్యాణపులోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతాన్ని తక్షణమే “నో మైనింగ్ జోన్” గా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం, 5వ షెడ్యూల్ సాధన కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోంపురం బంధ్ నుంచి జీడిగున్నవా మీదుగా కళ్యాణపులోవ రిజర్వాయర్ వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు.
నాయకులు మాట్లాడుతూ కళ్యాణపులోవ రిజర్వాయర్ పరిధిలో సుమారు 4,484 ఎకరాల ఆయకట్టు ఉండగా, ఈ నీటి వనరుపై దాదాపు 15 వేల మంది రైతులు జీవనాధారాన్ని పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి కీలక జలవనరుకు సంబంధించిన క్యాచ్‌మెంట్ ప్రాంతంలో గ్రానైట్ మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం పర్యావరణానికి, వ్యవసాయానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో గిరిజన సంఘాల పోరాటాల ఫలితంగా గ్రానైట్ తవ్వకాలపై నిలుపుదల విధించారని, అయితే ప్రస్తుతం మళ్లీ క్వారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ పరిధిలోని అటవీ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి, అక్కడ మైనింగ్ కార్యకలాపాలకు మార్గం సుగమం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభమైతే రిజర్వాయర్‌కు నీటి లభ్యత తగ్గడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, గిరిజన గ్రామాలు మరియు రైతుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల కళ్యాణపులోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతాన్ని శాశ్వతంగా నో మైనింగ్ జోన్‌గా ప్రకటించి, గ్రానైట్ క్వారీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కే. గోవిందరావు, నాయకులు గమ్మిల వాసుతో పాటు గిరిజన సంఘాల ప్రతినిధులు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








