న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్‌కు చెందిన దుష్ప్రచార నెట్‌వర్క్‌లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ప్రజల్లో గందరగోళం, అశాంతి సృష్టించే లక్ష్యంతో పనిచేస్తున్న 400కుపైగా పాకిస్థానీ సోషల్ మీడియా ఖాతాలను గుర్తించినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.
ఇంటెలిజెన్స్ బృందాల నిఘాలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఖాతాల ద్వారా మార్ఫింగ్ చేసిన వీడియోలు, తప్పుడు కథనాలు, నిరాధారమైన సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో క్రియాశీలంగా ఉన్న పలు ఖాతాలు ప్రస్తుతం మళ్లీ యాక్టివ్ అయినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో గుర్తించిన ఖాతాలను బ్లాక్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని, సైబర్ సెల్ బృందాలు 24 గంటల పాటు నిరంతర నిఘా నిర్వహిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. కేంద్ర నిఘా, భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలకు పోలీసులు కీలక సూచనలు కూడా జారీ చేశారు. సోషల్ మీడియాలో కనిపించే ఏదైనా పోస్ట్, వీడియో లేదా సందేశాన్ని షేర్ చేసే ముందు దాని వాస్తవికతను అధికారిక వనరుల ద్వారా ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పుకార్లు, నిరాధారమైన సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నప్పటికీ, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా దేశ వ్యతిరేక శక్తులకు పరోక్షంగా సహకరించినట్లవుతుందని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్రభుత్వ వనరులు లేదా విశ్వసనీయ మీడియా సంస్థల ద్వారా ధృవీకరించిన సమాచారాన్నే నమ్మాలని ఢిల్లీ పోలీసులు ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.A








