contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హైడ్రో పవర్ ప్రాజెక్టు .. సర్వేకు గ్రామస్తుల అడ్డుకట్టు

అనకాపల్లి జిల్లా అనంతగిరి మండలంలోని దాయర్తి గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సర్వే చేపట్టేందుకు వచ్చిన బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామసభ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే నిర్వహించేందుకు అనుమతించబోమని గిరిజనులు స్పష్టం చేశారు.

గ్రామస్తుల వివరాల ప్రకారం, జీనపాడు, పెద్దకోట, సరియా, మడ్రేవు, మాకనపల్లి, బుడ్డగమ్మి తదితర గ్రామాలకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సరియా గ్రామం పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహించేందుకు బృందం సర్వే సామగ్రితో గ్రామానికి చేరుకుంది.

ఈ విషయం తెలుసుకున్న దాయర్తి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సర్వేను అడ్డుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ జీవనాధారాలు దెబ్బతింటాయని, భూములు, అడవులు, సహజ వనరులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సర్వే బృందాన్ని ఉద్దేశించి అవసరమైన అనుమతులు, అధికారిక పత్రాలు చూపించాలని కోరారు. అయితే సర్వే బృందంలోని సభ్యులు హిందీ భాషలో మాట్లాడుతుండగా, స్థానిక ప్రజలతో సరైన సమాచార మార్పిడి జరగలేదని గ్రామస్తులు తెలిపారు.

అనుమతులు పూర్తిగా లభించే వరకు ఎటువంటి సర్వే కార్యకలాపాలు చేపట్టరాదని అటవీశాఖ అధికారులు బృందానికి సూచించినట్లు సమాచారం. దీంతో సర్వే బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది.

గ్రామసభ అనుమతి లేకుండా తమ ప్రాంతంలో ఎలాంటి సర్వేలు, ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అనుమతించబోమని గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో కొండతామలు చిన్నారావు, సోమన్న, ఆనంద్ తదితర గ్రామ పెద్దలు, గిరిజన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :