మెదక్ జిల్లా , తూప్రాన్ : వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మహిళపై దోపిడీ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, మే 30న వెల్దుర్తి మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ వద్ద రాజమ్మ అనే మహిళను నిందితులు మద్దూరి శ్రీకాంత్, ఎండీ శైలాని ఆటోలో ఎక్కించుకుని ఆరేగూడెం వద్ద దింపుతామని నమ్మబలికారు. అనంతరం బస్వాపూర్ గ్రామ శివారులోని చెరువు కట్ట ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఆమె ధరించిన బంగారు చెవి కమ్మలను బలవంతంగా లాక్కొని పరారయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం తూప్రాన్ సమీపంలోని నర్సాపూర్–తూప్రాన్ బ్రిడ్జి వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడు మద్దూరి శ్రీకాంత్ వద్ద నుంచి దోపిడీకి ఉపయోగించిన ఆటో (నంబర్: టీజీ 35 టీ 0627)ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగిలించిన బంగారు చెవి కమ్మలను కొత్తూరులోని కృష్ణ జ్యువెలరీ షాప్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆశయం వెంకట్ రాజ్ గౌడ్, వెల్దుర్తి ఎస్సై జ్యోతి ఆధ్వర్యంలో పోలీసులు పి. గోవర్ధన్ రావు, కృష్ణ, సురేష్, మహేష్ తదితరులు సమర్థవంతంగా ఛేదించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు బృందాన్ని తూప్రాన్ డీఎస్పీ అభినందించి తగిన రివార్డులు అందజేస్తామని తెలిపారు.
అరెస్టు చేసిన నిందితులు నర్సాపూర్ మండలానికి చెందిన మద్దూరి శ్రీకాంత్ (30), ఎండీ శైలాని (27)గా పోలీసులు గుర్తించారు.








