పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో పాలకొండ సబ్ కలెక్టర్, ఇంచార్జ్ ఐటిడిఏ పీవో పవర్ స్వప్నిల్ జగన్నాద్ గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రగిరిలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.
ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ పనులు ఏవైనా ఉంటే వాటిని వెంటనే పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్‌తో పాటు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రారంభమైతే గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని ఆయన పేర్కొన్నారు.
అనంతరం సవరకోటపాడు నర్సరీ (పార్క్)ను సందర్శించిన సబ్ కలెక్టర్, చిన్నారులు ఆడుకోవడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఐటిడిఏ అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
అలాగే ఎల్విన్‌పేట గ్రామంలోని ఆసుపత్రి ఆవరణతో పాటు ఎల్విన్‌పేట–గుణుపూర్ జంక్షన్ సమీపంలోని చెరువులను సుందరంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో తహసీల్దార్ శేఖర్, ఆర్ఐ శివప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాసరావు, వాటర్‌షెడ్ అధికారి పోలినాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.








