contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఫారం-46 నోటీసులు వెంటనే జారీ చేయాలి

  • శరభవరం సచివాలయం వద్ద మూడు గ్రామాల గిరిజనుల ధర్నా

 

రోలుగుంట : అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని లోసింగి రెవెన్యూ కొండశిఖర గ్రామ పరిధిలో ఉన్న పెదగరువు, పాతలోసింగి, కొత్తలోసింగి గ్రామాలకు చెందిన పీవీటీజీ కొందు ఆదివాసీ గిరిజనులు శనివారం శరభవరం గ్రామ స్వర్ణ పంచాయతీ కార్యాలయం (సచివాలయం) ఎదుట ధర్నా నిర్వహించారు. రీ-సర్వే అనంతరం ఫారం-46 నోటీసులను వెంటనే జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

గ్రామస్తుల వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారదర్శక రీ-సర్వే కార్యక్రమం మార్చి నెలలో నిర్వహించబడింది. విలేజ్ సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది ఫీల్డ్ సర్వే పూర్తి చేసి మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఫారం-46 నోటీసులు జారీ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు సరిహద్దుల చట్టం-1923లోని సెక్షన్ 9(2) ప్రకారం సర్వే రిజిస్టర్‌లో నమోదైన భూమి వివరాలను ఫారం-46 ద్వారా భూ యజమానులకు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నోటీసులు అందిన తర్వాత భూమి వివరాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల వ్యవధిలో తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

అయితే మూడు నెలలు గడిచినా నోటీసులు జారీ కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని గిరిజనులు ఆరోపించారు. భూముల వివరాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే వెంటనే ఫారం-46 నోటీసులు అందజేయాలని డిమాండ్ చేశారు.

వారం రోజుల్లోగా నోటీసులు జారీ చేయకపోతే ప్రజా సమస్యల పరిష్కార కేంద్రం వద్ద నాలుగు వారాల పాటు దశలవారీ ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో కొండతాంబలి వెంకట్రావు, కొండపాంబుల సత్తిబాబు, కిలో మహేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :