పాస్‌పోర్ట్ పొందాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన రుసుములను గణనీయంగా పెంచుతూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) నిర్ణయం తీసుకుంది. సవరించిన కొత్త ఫీజులు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జూన్ 20న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాస్‌పోర్ట్ సేవల నిర్వహణ వ్యయాలు పెరగడంతో చాలా సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త రుసుముల ప్రకారం సాధారణ కేటగిరీలో 36 పేజీల అడల్ట్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగింది. అంటే దాదాపు 67 శాతం పెంపు జరిగింది. అలాగే 60 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ.2,000 నుంచి రూ.3,500కు పెంచారు. ఇది 75 శాతం పెరుగుదల.
తత్కాల్ సేవలను వినియోగించుకునే వారికి కూడా కొత్త రుసుములు వర్తించనున్నాయి. 36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం రూ.5,000, 60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 18 ఏళ్లలోపు మైనర్లకు 36 పేజీల పాస్‌పోర్ట్ జారీకి రూ.1,750 ఫీజును నిర్ణయించారు.
పాస్‌పోర్ట్ పోయినా లేదా దెబ్బతిన్నా కొత్త పాస్‌పోర్ట్ పొందేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం పెంచింది. సాధారణ విధానంలో 36 పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్‌కు రూ.5,000, 60 పేజీల పాస్‌పోర్ట్‌కు రూ.6,000 చెల్లించాలి. అదే తత్కాల్ విధానంలో పొందాలంటే వరుసగా రూ.7,500, రూ.8,500 చెల్లించాల్సి ఉంటుంది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) కోసం రూ.750 ఫీజును ఖరారు చేశారు.
ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో పాత రుసుములే కనిపిస్తున్నప్పటికీ, జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే పాస్‌పోర్ట్ చెల్లుబాటు కాలంలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించారు. పెద్దలకు పాస్‌పోర్ట్ 10 సంవత్సరాలు, మైనర్లకు 5 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది.








