మెట్‌పల్లి (జగిత్యాల జిల్లా) : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ట్రాక్టర్ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి, దొంగిలించిన ట్రాక్టర్‌తో పాటు ఒక స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న ఆత్మకూరు గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి తన ట్రాక్టర్ దొంగిలించబడిందని మెట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు, నిందితులు ప్రయాణించిన మార్గాలు, ఇతర సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కానిస్టేబుళ్లు విశాల్, సుదర్శన్, ప్రణయ్, విజయ్‌లతో కూడిన ప్రత్యేక బృందాలు ట్రాక్టర్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
సాంకేతిక ఆధారాల ద్వారా కోనాపూర్‌కు చెందిన మారంపల్లి సాయికుమార్ ట్రాక్టర్‌ను దొంగిలించి, అరపేట హౌస్‌కట్ ప్రాంతంలో దాచిపెట్టి, దానిని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ట్రాక్టర్ చోరీ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి దొంగిలించిన ట్రాక్టర్‌తో పాటు ఒక స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సురేష్ బాబు, ఎస్సై కిరణ్ కుమార్ వెల్లడించారు.
కేసును అత్యంత వేగంగా ఛేదించిన ప్రత్యేక పోలీసు బృందాన్ని జిల్లా ఉన్నతాధికారులు అభినందించినట్లు పోలీసులు తెలిపారు.








