పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సబ్‌డివిజన్ పరిధిలోని ముత్తారం పోలీస్ స్టేషన్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించి అక్కడికి వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ముత్తారం ఎస్ఐ రవికుమార్‌కు ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన కమిషనర్, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
పోలీస్ సిబ్బందితో సమావేశమైన కమిషనర్, ప్రతి కానిస్టేబుల్ తన పరిధిలోని గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి స్వయంగా ఫోన్ చేసి ఆ రోజు నిర్వహించిన విధుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే డయల్–100 కాల్స్‌కు పోలీసులు స్పందిస్తున్న తీరును సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.
ఈ ఆకస్మిక తనిఖీలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ముత్తారం ఎస్ఐ రవికుమార్, రామగిరి ఎస్ఐ టి. శ్రీనివాస్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.








