గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో భూ భారతి (రెవెన్యూ సదస్సు) ద్వారా వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ.. వాటిని పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని సీపీఐ నాయకులు ఆరోపించారు. ప్రతి భూ సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అన్నారు.
గన్నేరువరం మండల రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించలేదని పేర్కొన్నారు. భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా అధికార యంత్రాంగం స్పందించి మండల స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి పెండింగ్లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో గన్నేరువరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
అదేవిధంగా గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాలు చేపట్టే ధర్నాకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువజన సంఘాలతో కలిసి పోరాడుతామని నాయకులు తెలిపారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కాంతాల అంజిరెడ్డి, మండల కార్యదర్శి చొక్కల శ్రీశైలం, సహాయ కార్యదర్శులు కూన మల్లయ్య, అంజయ్య, పిప్పల కనకయ్య, మాదాపూర్ గ్రామ సహాయ కార్యదర్శి లింగం గణేష్, మండల నాయకులు ఎండీ నయీమ్, కూన కిష్టయ్య, దామా సంపత్, కొరివి చంద్రయ్య, కొరివి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.








