కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్‌లో ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు సంస్థ వ్యవస్థాపకుడు, సామాజిక ఉద్యమ నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి, మందకృష్ణ మాదిగ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, వీఎచ్‌పీఎస్ (VHPS) సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంస్థ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ గత మూడు దశాబ్దాలుగా మాదిగల హక్కులు, సామాజిక సమానత్వం, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపై నిరంతర ఉద్యమం సాగిస్తూ కీలక పాత్ర పోషించిందన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేపట్టిన ఉద్యమాలు సామాజిక మార్పుకు దోహదపడ్డాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి గుండా థామస్ మాదిగ, జిల్లా కో-ఇన్‌చార్జి మంత్రి మల్లేష్ మాదిగ, వికలాంగుల చైతన్య సంఘం అధ్యక్షుడు కాయ్యూం, వీఎచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు బన్న మూర్తి, మండల ఇన్‌చార్జి నక్క విజయ్ మాదిగతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.








