జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్లలో మంగళవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ ఆగంతకుడు దొంగిలించి పరారయ్యాడు. దీంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సుమారు 18 కిలోమీటర్ల మేర సినిమాను తలపించే రీతిలో వెంబడించి చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్ల బస్టాండ్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్టార్ట్ చేసి నిజామాబాద్ వైపు వేగంగా తీసుకెళ్లాడు. దీనిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అప్రమత్తమై బస్సును వెంబడించడం ప్రారంభించారు.
పరారీలో ఉన్న నిందితుడు మార్గమధ్యంలో కోరుట్ల, ఆరపేట, వెంకట్రావుపేట ప్రాంతాల్లో మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదాల్లో బైక్‌లపై ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. అనంతరం తనను వెంబడిస్తున్న పోలీసు వాహనాన్ని కూడా బస్సుతో ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.
అంతేకాకుండా మెట్పల్లి సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును తృటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
నిందితుడిని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో పోలీసులు మెట్పల్లి మండలంలోని గండి హనుమాన్ ఆలయం సమీప జాతీయ రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి బస్సును నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది.
బస్సు ఆగిన వెంటనే నిందితుడు కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా, అప్రమత్తంగా ఉన్న పోలీసులు వెంటాడి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు బస్సును ఎందుకు దొంగిలించాడు? అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.








