తూప్రాన్ పట్టణంలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు రాత్రివేళల్లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
తూప్రాన్ సీఐ వెంకటరాజా గౌడ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు గంగరాజు, జ్యోతి, పోలీసు సిబ్బందితో కలిసి శనివారం అర్ధరాత్రి పట్టణంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నర్సాపూర్ రోడ్, తూప్రాన్ టౌన్‌లోని ప్రధాన కూడళ్లు, కాలనీలు, శివారు ప్రాంతాలతో పాటు అనుమానాస్పద కదలికలు ఉండే ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిపై తదుపరి విచారణ చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

అదేవిధంగా గతంలో జరిగిన దొంగతనాలు, ఇతర నేరాల నేపథ్యంలో ఫింగర్‌ప్రింట్ నిపుణుల సహాయంతో 10 మంది అనుమానితుల వివరాలను పరిశీలించి, వారి వేలిముద్రలను తనిఖీ చేశారు. రాత్రివేళల్లో పట్టణంలోకి ప్రవేశించే, పట్టణం నుంచి బయటకు వెళ్లే వాహనాలను ఆపి వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర వివరాలను పరిశీలించారు.
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ను కూడా ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఐ వెంకటరాజా గౌడ్ మాట్లాడుతూ.. దొంగతనాల నివారణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక వాహన తనిఖీలు, పెట్రోలింగ్‌ను మరింత విస్తృతం చేస్తున్నామని తెలిపారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం, ఫింగర్‌ప్రింట్ డేటా సహాయంతో అనుమానితుల వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ఇళ్లు, దుకాణాలు, గోదాములు, షెడ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.








