పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని : గోదావరిఖని పట్టణంలోని మెయిన్ చౌరస్తాలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అద్భుతంగా అభివృద్ధి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తెలిపారు. గురువారం ఆలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆలయ నూతన నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాన్ని (మోడల్ డిజైన్) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవాదాయ శాఖ ద్వారా సుమారు రూ.40 లక్షల నిధులతో పోచమ్మ తల్లి దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. భక్తుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
అవసరమైతే అదనపు నిధులు కూడా సమకూర్చి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “పోచమ్మ తల్లి ఆలయం ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. భక్తులకు అన్ని వసతులు కల్పించేలా ఆధునిక సౌకర్యాలతో ఆలయాన్ని నిర్మిస్తాం. నిర్మాణ వ్యయంలో ఎలాంటి వెనుకడుగు వేయం” అని ఆయన అన్నారు.
అనంతరం ఆలయ నిర్మాణానికి సంబంధించిన మోడల్ డిజైన్‌ను ఆవిష్కరించి, త్వరలోనే పనులు ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, ఆర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.









