నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని పితృగడ్డ పీవీటీజీ (PVTG) కొందు గిరిజన గ్రామానికి చెందిన కొర్ర సుబ్బారావు (56) నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు తమ వద్ద ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రి సిబ్బందిని అంబులెన్స్ ఇవ్వాలని కోరగా, ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే ఐటీడీఏ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని, కొండ దిగువ గ్రామాలకు సేవలు వర్తించవని ఆసుపత్రి సిబ్బంది తెలిపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ విషయమై నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సంప్రదించగా, ఐటీడీఏ అంబులెన్స్‌ను వినియోగించుకోవాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం మృతుడి కుమారుడు కొర్ర కొండబాబు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావును ఆశ్రయించగా, ఆయన నర్సీపట్నం ఆర్డీవోకు సమాచారం అందించినట్లు చెప్పారు. అనంతరం సంబంధిత అధికారులతో సంప్రదింపులు కొనసాగినప్పటికీ మధ్యాహ్నం వరకు అంబులెన్స్ అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు.
తర్వాత పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) దృష్టికి విషయం తీసుకెళ్లగా, ఆయన జోక్యంతో మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని పితృగడ్డ గ్రామానికి తరలించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు మాట్లాడుతూ, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించే నాన్-షెడ్యూల్డ్ గిరిజనులు సహా పేద కుటుంబాలకు మృతదేహాల తరలింపునకు అంబులెన్స్ సౌకర్యం కల్పించే విధంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే, సమస్య పరిష్కారానికి వెంటనే స్పందించి అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో సహకరించిన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి మృతుడి కుమారుడు కొర్ర కొండబాబు, సీపీఎం నాయకుడు కే. గోవిందరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని పిత్రిగడ్డ గిరిజన గ్రామానికి వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉండటంతో మృతదేహాన్ని గ్రామస్తులు భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గ్రామానికి చెందిన కొర్ర సుబ్బారావు మృతదేహాన్ని నర్సీపట్నం నుంచి అంబులెన్స్‌లో తీసుకొచ్చినప్పటికీ, ఆర్ల నుంచి పిత్రిగడ్డకు వెళ్లే మార్గంలో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో అంబులెన్స్ ముందుకు వెళ్లలేకపోయిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని సుమారు అర కిలోమీటరు దూరం భుజాలపై మోసుకుని గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, 2024 డిసెంబర్ 2న ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) నిధుల నుంచి సుమారు రూ.4.10 కోట్లతో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో రూ.1 కోటి వరకు ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొన్నప్పటికీ, కేవలం క్రషర్ రాళ్లు వేసి పనులను మధ్యలోనే నిలిపివేశారని ఆరోపించారు. వర్షాలకు ఆ రహదారి పూర్తిగా దెబ్బతిన్నట్లు చెప్పారు.
అలాగే, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో రూ.29 లక్షల వ్యయంతో నాలుగు కల్వర్టులు నిర్మించినప్పటికీ, వాటి మధ్య రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయకుండా పనులను నిలిపివేశారని గ్రామస్తులు విమర్శించారు.
రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు శ్రమదానం చేసి మట్టి, కంకరతో తాత్కాలికంగా బైక్‌లు వెళ్లేలా మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ అత్యవసర సమయాల్లో అంబులెన్స్, ఇతర వాహనాలు గ్రామానికి చేరుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆర్ల–పిత్రిగడ్డ రహదారిని పూర్తిస్థాయిలో నిర్మించి, గిరిజన గ్రామ ప్రజలకు రాకపోకల సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.








