పెద్దపల్లి జిల్లా, (గోదావరిఖని ): ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలో చూపిస్తూ మంథని మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతికుమార్ మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. తనకు వచ్చిన రెండు నెలల కౌన్సిలర్ వేతనాన్ని బోయిన్‌పేట అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తూ నాలుగు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీలత క్రాంతికుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత మరచిపోవడం కాకుండా వాటిని నిలబెట్టుకోవడమే నిజమైన ప్రజాప్రతినిధి బాధ్యత అని అన్నారు. రాజకీయ పార్టీల మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ప్రజల ఆశీర్వాదంతో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన అనంతరం, ప్రతి నెల తన కౌన్సిలర్ వేతనాన్ని ప్రజల సేవకే వినియోగిస్తానని ప్రకటించానని గుర్తు చేశారు. ఆ హామీలో భాగంగానే రెండు నెలల వేతనంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
పేద కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బియ్యం, కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులను అందజేసి వారికి అండగా నిలిచారు. ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే స్వంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీలత క్రాంతికుమార్, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలవడం, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయబోనని, బోయిన్‌పేట అభివృద్ధితో పాటు వార్డు ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ, నిస్వార్థంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు.
ప్రజల సహకారం, విశ్వాసంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి బోయిన్‌పేటను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని శ్రీలత క్రాంతికుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు.







