నాగర్‌కర్నూల్ జిల్లా: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ (IHRPC) నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీగా నియమితులైన చారగొండ సత్యంను పలువురు ప్రజా, సామాజిక నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణలో ఆయన చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంధం స్వామి, ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు కిన్నెర పాండు, అనిల్ కుమార్, వేదవ్యాస్, వెంకటేష్, బాలచందర్ తదితరులు చారగొండ సత్యంను శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చారగొండ సత్యం తన సామాజిక అనుభవం, సేవా దృక్పథాన్ని ఉపయోగించి జిల్లాలో మానవ హక్కుల పరిరక్షణతో పాటు వివిధ సామాజిక సమస్యలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించాలని కోరారు. యువత డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్న ఆయన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో కష్టాలను అధిగమిస్తూ ఉన్నత విద్యను అభ్యసించిన చారగొండ సత్యం సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించారని నాయకులు కొనియాడారు. తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఇతరులకు రాకూడదనే సంకల్పంతో శ్రీజ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్, శ్రీజ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా పేద, నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై అవగాహన కల్పిస్తూ శిక్షణ అందిస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తూ వారి విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాలు, విద్యార్థుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి IHRPC నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించడం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా చారగొండ సత్యం మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి IHRPC నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ, యువతలో సామాజిక చైతన్యం పెంపొందించడం, పేదలు, అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక కార్యకర్తలు, యువజన నాయకులు, మేధావులు, శ్రేయోభిలాషులు పాల్గొని చారగొండ సత్యంకు అభినందనలు తెలియజేశారు.







