మెదక్/తూప్రాన్ : మిషన్ భగీరథ నీటి సరఫరాలో లీకేజీ సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. రిపోర్టర్ టీవీలో ప్రసారమైన కథనంపై స్పందించిన ఆయన సోమవారం అల్లదుర్గ్, టేక్మాల్ మండల కేంద్రాల్లోని మిషన్ భగీరథ నీటి సరఫరా పంపింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా నీటి సరఫరా వ్యవస్థ పనితీరును, పంపింగ్ కేంద్రాల నిర్వహణను పరిశీలించిన అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వ ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచాలని, నిరంతరం శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన తాగునీరు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న అదనపు కలెక్టర్, నీటి సరఫరా వ్యవస్థలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ తనిఖీల్లో మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







