పల్నాడు జిల్లా మాచర్ల : పట్టణంలోని నారాయణ పాఠశాలలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో స్టూడెంట్స్ ఎలక్షన్స్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ నాజీర్ బేగ్ హాజరై ఎన్నికల ప్రక్రియను పరిశీలించి విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా సీఐ షేక్ నాజీర్ బేగ్ మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం అలవడాలని సూచించారు. ఇటువంటి ఎన్నికల నిర్వహణ ద్వారా ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందుతాయని, భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందంజలో నిలిచే అవకాశాలు విద్యార్థులకు లభిస్తాయని అన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తిని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నారాయణ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థి ప్రతినిధులకు మెడల్స్, ట్రోఫీలు (ప్లాక్స్), సర్టిఫికెట్లను అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి, పల్నాడు జిల్లా ఏజీఎం జానకిరామిరెడ్డి, జెడ్సీవోలు భద్రారెడ్డి, గౌస్య, రిహాని, స్కూల్ ఇన్‌చార్జీలు ఆంజనేయులు, ఉదయలక్ష్మి, చంద్రిక, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవి నాయక్, చంద్రయ్యతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








