భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న వ్యవసాయ బావి ప్రమాదకరంగా మారి గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామంలోకి ప్రవేశించే మూలమలుపు వద్ద రహదారికి ఆనుకుని ఉన్న ఈ బావి కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు ప్రయాణిస్తున్నారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, వెంకట్రావుపల్లికి అనుబంధంగా ఉన్న జోడుపల్లెకు వ్యవసాయ పనుల కోసం హార్వెస్టర్లు, ట్రక్కులు, లారీలు తరచూ రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా పంట కోతల సమయంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు భారీ వాహనాలు ఈ మార్గాన్నే ఉపయోగిస్తాయి. అయితే మూలమలుపు వద్ద వ్యవసాయ బావి ఉండటంతో రహదారి ఇరుకుగా మారి భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు.
అంతేకాకుండా బావి పక్కనున్న రహదారి కింద మట్టి క్రమంగా కుంగిపోతుండటంతో రోడ్డు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని వెంటనే పరిశీలించి రక్షణ గోడ నిర్మించడం, రహదారిని బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాలని వారు అధికారులను కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలు సక్రమంగా నిర్వహించడం లేదని, ఒంటరి మహిళలకు పింఛన్లు అందడం లేదని, వీధి దీపాల సమస్యతో పాటు పలు మౌలిక సదుపాయాల లోపాలు నెలకొన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ వ్యవసాయ బావి సమస్యను తక్షణమే పరిష్కరించి, గ్రామంలోని ఇతర సమస్యలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.








