రామగిరి, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నవాబ్‌పేట్ గ్రామంలోని బుడగ జంగం కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోడకుర్తి సుజాత (22) అనే యువతి మంగళవారం తన ఇంట్లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానికుల సమాచారం మేరకు.. సుజాత తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని పరిస్థితిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని చూడగా యువతి అప్పటికే మృతి చెంది కనిపించడంతో విషాదంలో మునిగిపోయారు.
ఘటనపై సమాచారం అందుకున్న రామగిరి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సమాచారం.
యువతి ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.








