contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భారీ వర్షాలకు గోదావరిఖని అతలాకుతలం – సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని : గోదావరిఖని పట్టణంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైంది. విఠల్‌నగర్, కల్యాణ్‌నగర్‌తో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా 5 ఇంక్లైన్ ప్రధాన రహదారిలోని రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రధాన కాలువల గుండా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రమాదాలను నివారించేందుకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ప్రధాన రహదారిపై రాకపోకలను నిలిపివేసి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

భారీ వర్షాల ప్రభావం సింగరేణి బొగ్గు ఉత్పత్తిపైనా పడింది. గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కల్యాణ్‌నగర్, గోదావరిఖని మేకల మార్కెట్ సమీప ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీ కుండీల మూతలను తొలగించి నీరు వేగంగా బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు.

ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షంతో పలు కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఏవైనా అత్యవసర సమస్యలు తలెత్తితే 9603666444, 18004257062, 9392483959 నంబర్లకు సమాచారం అందించాలని నగర మేయర్ మహంకాళి స్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :