కామారెడ్డి – బాన్సువాడ: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం బాన్సువాడ మండలం తాడుకోలు గ్రామంలోని రాజారాం దుబ్బలో భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 140 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్న ఈ తనిఖీల్లో వాహనాల ధ్రువపత్రాలు, అనుమానాస్పద కార్యకలాపాలపై విస్తృతంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా 112 ద్విచక్ర వాహనాలు, ఐదు కార్లు, 18 ఆటోరిక్షాలను పోలీసులు తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం (సీజ్) చేసుకున్నారు. నిబంధనలు పాటించని వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కార్డన్ సెర్చ్‌లో భాగంగా కాలనీ ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల నుంచి అప్రమత్తంగా ఉండే విధానాలు, గంజాయి నిర్మూలన, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ, బాన్సువాడ డివిజన్‌కు చెందిన సీఐలు, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








