కారంపూడి – పల్నాడు జిల్లా : పారిశుధ్య కార్మికులు లేకుండా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ సాధ్యం కాదు. ప్రతిరోజూ ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న కార్మికులకే నెలల తరబడి జీతాలు అందకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు కారంపూడిలో తలెత్తుతోంది. కారంపూడి మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది, వాటర్ సప్లై సిబ్బంది, ఇతర పంచాయతీ కార్మికులు తమకు 16 నెలలకు పైగా వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు అందక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని కార్మికులు చెబుతున్నారు. దీంతో ఇక ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
గతంలో సీఐటీయూ నాయకులతో కలిసి కారంపూడి పారిశుధ్య కార్మికులు తమ వేతనాల సమస్యపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి కారంపూడికి వచ్చి కార్మికులతో చర్చించినట్లు వారు తెలిపారు. త్వరలోనే పెండింగ్ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కార్మికులు పేర్కొన్నారు.
అయితే ఆ హామీ ఇచ్చి దాదాపు రెండు నెలలు గడిచినా తమ ఖాతాల్లో జీతాలు జమ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారి హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కారంపూడి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో గంటా శ్రీనివాసరెడ్డిని కార్మికులు కలిసి తమ వేతనాల సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీ కూడా అమలుకు నోచుకోలేదని కార్మికులు చెబుతున్నారు.
ఒకవైపు నెలల తరబడి జీతాలు లేక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అధికారులు ఇచ్చే హామీలు అమలు కాకపోవడంతో ఇక సమ్మె తప్ప మరో మార్గం లేదని వారు అంటున్నారు.
తమ సమస్య పరిష్కారం కోసం పంచాయతీ విస్తరణ అధికారికి సమ్మె నోటీసు ఇచ్చినట్లు పారిశుధ్య కార్మికులు మీడియాకు తెలిపారు. 10వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని, 15వ తేదీన దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు వారు వెల్లడించారు.
పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, భవిష్యత్తులో ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కారంపూడి పంచాయతీలో పారిశుధ్య కార్మికుల వేతనాల సమస్యతో పాటు పలు అంశాలపై గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజల్లో కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల వేతనాల కోసం కేటాయించిన నిధులు ఉన్నాయా? ఉంటే ఎందుకు జీతాలు చెల్లించడం లేదు? నిధులు ఇతర అవసరాలకు మళ్లించారా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చకు వస్తున్నాయి.
అయితే నిధుల దుర్వినియోగంపై వచ్చిన అనుమానాలు, ఆరోపణలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. పంచాయతీ అధికారులు పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించి, కార్మికుల వేతనాలపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
కార్మికుల సమస్య ఇంతకాలం కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారులు, స్థానిక పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ వేతనాలను చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. తమ సమస్యను పరిష్కరించకపోతే సమ్మె, దీక్షను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకంగా పనిచేసే పారిశుధ్య సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందకపోవడం పట్ల జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.









