కోరుట్ల, జగిత్యాల జిల్లా: కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలను నిరంతరం పర్యవేక్షించే చర్యల్లో భాగంగా ఈ తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసులో నిబంధనలకు అనుగుణంగా సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలు, వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.
పోలీసు సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి ఎంతో ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
స్టేషన్ పరిధిలో బీట్ వ్యవస్థ అమలు, రాత్రి గస్తీ, నేరాల నియంత్రణ చర్యలను ఎస్పీ సమీక్షించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. నేరాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా గ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఓటీపీ, కేవైసీ పేరుతో జరిగే మోసాలు, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల్లో సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సూచించారు. ప్రమాదకర డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం, నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగంపై చట్టపరమైన చర్యలు కొనసాగించాలని తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీసులు విధులు నిర్వహిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ సిబ్బందికి సూచించారు.








