- ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తిపై గొడ్డలితో దాడి.. అక్కడికక్కడే మృతి
పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న కొమ్ము ఇమ్మానుయేలు (35)పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానిక సమాచారం ప్రకారం.. ఇమ్మానుయేలు రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు అతనిపై ఆకస్మికంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. గొడ్డలితో తీవ్రంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసు అధికారులు ఆరా తీశారు. మృతుడికి ఎవరితోనైనా పాత కక్షలు ఉన్నాయా? వ్యక్తిగత వివాదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు వివిధ కోణాల్లో ఆధారాలను సేకరిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇమ్మానుయేలు హత్యతో ఓబులేసునిపల్లెలో తీవ్ర విషాదం నెలకొంది. నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.








