contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వెలిగొండతో మార్కాపురం రూపురేఖలు మారుతాయి: నిమ్మల రామానాయుడు

మార్కాపురం : రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి విడత పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి నాటికి నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, నిర్వాసితుల పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, మౌలిక వసతులు, ముంపు గ్రామాల ప్రజల తరలింపుపై గురువారం మార్కాపురం కలెక్టరేట్‌లో మంత్రి నిమ్మల రామానాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొల్లంవాగు వద్ద సుమారు 80 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులను పూర్తి చేసి ఛానల్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. గతంలో నిలిచిపోయిన వింగ్స్, సీసీ వాల్స్ వంటి కాంక్రీట్ పనులను మే 2026 నాటికే పూర్తి చేశామని పేర్కొన్నారు.

టన్నెల్-2లో మిగిలిన లైనింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, మొత్తం 19 కిలోమీటర్ల లైనింగ్‌లో ప్రస్తుతం కేవలం 150 మీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని మంత్రి వివరించారు. 4.9 కిలోమీటర్ల బెంచింగ్ పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. 11వ కిలోమీటర్ వద్ద ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సుమారు 1,900 మెట్రిక్ టన్నుల టన్నెల్ బోరింగ్ మెషిన్లు, ఇతర వ్యర్థాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి, కేవలం 60 రోజుల్లో 1,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు చెప్పారు.

రూ.460 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫీడర్ కెనాల్ పనుల్లో 5.1 కిలోమీటర్ల సీసీ వాల్స్, 11 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు.

నిర్వాసితులకు రూ.318 కోట్ల పరిహారం

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పనిచేస్తోందని మంత్రి తెలిపారు. సుమారు రూ.900 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో ఇప్పటికే రూ.318 కోట్ల నిధులను విడుదల చేసి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు పేర్కొన్నారు.

అవార్డు ప్రకటనలో సాంకేతిక లోపాలు, పేర్ల నమోదులో తప్పులు, గ్రామస్థాయి వీఆర్డీఎస్ కమిటీల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరిస్తామని తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్క నిర్వాసిత కుటుంబానికీ అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న చుక్కల భూముల రైతుల సమస్యను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి చెప్పారు. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నప్పటికీ, మానవీయ కోణంలో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

శ్రీశైలం నీటి మట్టం అనుకూలంగా ఉంది

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 870 అడుగుల వద్ద ఉందని, వెలిగొండకు నీటిని తరలించేందుకు కనీసం 855 అడుగుల నీటి మట్టం అవసరమని మంత్రి వివరించారు. ప్రస్తుత అనుకూల పరిస్థితిని సద్వినియోగం చేసుకుని తొలి విడతగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 10 నుంచి 15 రోజుల్లో దాదాపు 10 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు తరలించే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను వినియోగించుకోకపోతే మరోసారి నీటి విడుదలకు ఏడాదికి పైగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రతరం కావచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, నిర్వాసితులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

మార్కాపురాన్ని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం

వెలిగొండ జలాలతో సాగు, తాగునీటి అవసరాలు తీరడమే కాకుండా మార్కాపురం ప్రాంతంలో పారిశ్రామిక, ఉద్యానవన రంగాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

మార్కాపురం ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఉన్న రూ.20 వేల కోట్ల రాయలసీమ హార్టీకల్చర్ మిషన్‌లో ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతాన్ని కూడా భాగస్వామ్యం చేసి సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.

సమీక్షా సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహ రెడ్డి, అశోక్ రెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ ఎరిక్షన్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఇన్‌చార్జి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు, వెలిగొండ ప్రాజెక్టు సీఈ రమేష్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :