గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గుండ్లపల్లి క్రాస్‌రోడ్ పంచాయతీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
గన్నేరువరం మండలం గుండ్లపల్లి క్రాస్‌రోడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్‌తో కలిసి శాఖా గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే సుమారు రూ.30 లక్షల వ్యయంతో వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాజాగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించినట్లు చెప్పారు.
గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రహదారి నిర్మాణానికి సంబంధించిన సుమారు రూ.100 కోట్ల బిల్లులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ద్వారా పెండింగ్ బిల్లులను పరిష్కరించి, త్వరలోనే కాంట్రాక్టర్‌తో రహదారి పనులను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
గన్నేరువరం మండల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు కవ్వంపల్లి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన అన్ని వసతులతో సొంత భవనాలను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. త్వరలోనే అన్ని హంగులతో పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనం కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతులను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
స్థలదాతలకు సన్మానం
గుండ్లపల్లి క్రాస్‌రోడ్ పంచాయతీ భవన నిర్మాణానికి విలువైన స్థలాన్ని ఉచితంగా అందించిన వంగల నర్సింహారెడ్డి, సులోచనమ్మ దంపతులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. వారికి శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
గుండ్లపల్లి గ్రామంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో ఎంపికైన 27 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే గ్రామానికి చెందిన ఓ దివ్యాంగుడికి ప్రభుత్వం మంజూరు చేసిన త్రిచక్ర వాహనం (స్కూటీ)ని ఎమ్మెల్యే అందించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, ఎంపీడీవో, తహసీల్దార్ నరేందర్, గ్రామ సర్పంచ్ చింతల ఉమారాణి, పద్మ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునిల్, ముస్కు ఉపేందర్ రెడ్డి, మాతంగి అనిల్, అలువాల కోటి, జె.మన్మోహన్ రావు, సీహెచ్ శ్రీధర్ రెడ్డి, బుర్ర తిరుపతిగౌడ్, సురేందర్ రెడ్డి, న్యాత జీవన్, సంతోష్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.








