జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా అధికారులు ఏర్పాటు చేసిన శకటాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మంత్రి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించి అభినందించారు.
సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం
ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ప్రాణ బలిదానాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాలన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం
జగిత్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. నూతన చేయూత పెన్షన్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భీమా వంటి పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విద్యా రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, అంతర్జాతీయ స్థాయి బోధన అందించాలనే లక్ష్యంతో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
అలాగే కేంద్రీయ విద్యాలయ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన పూర్తయిందని, ప్రస్తుతం తాత్కాలిక భవనంలో విద్యార్థుల అడ్మిషన్లు కొనసాగుతున్నాయని చెప్పారు.
విద్యార్థులకు మెరుగైన వసతులు
షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో వసతి గృహాలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 2024 అక్టోబర్ నుంచి విద్యార్థులకు డైట్ ఛార్జీలను 200 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 40 శాతం పెంచినట్లు వెల్లడించారు.
విద్య, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతులు సహా అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.








