శబరిమల : కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాస పూజల సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనున్నాయి. ఆలయ ప్రధాన తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో మేల్శాంతి ప్రసాద్ ఈడీ గర్భగుడి తలుపులు తెరిచి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
మలయాళ నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఆగస్టు 17న ఉదయం 5 గంటల నుంచి భక్తులకు అయ్యప్ప స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిన అనంతరం ఆగస్టు 21న రాత్రి 10 గంటలకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు.
అనంతరం ఓనం పండుగ ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 24న ఆలయాన్ని తిరిగి తెరవనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.
భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు
శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, కేరళ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పంబ బేస్ క్యాంప్‌కు చేరుకునే భక్తుల సౌకర్యార్థం నిలక్కల్ నుంచి 24 గంటల పాటు ఆర్టీసీ షటిల్ బస్సు సేవలను అందుబాటులో ఉంచారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రవాణా, దర్శనం తదితర అంశాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు ముందుగానే ‘శబరిమల ఆన్లైన్ పోర్టల్’ ద్వారా వర్చువల్ క్యూ స్లాట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
చింగం మాస పూజల సందర్భంగా శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.








