ఏలూరు జిల్లా, ముసునూరు: వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా విలువ జోడించి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా వాటి విలువ పెరగడంతో రైతులకు అధిక ఆదాయం లభించడంతో పాటు రాష్ట్రంలో సంపద సృష్టికి మార్గం సుగమమవుతుందని అన్నారు.
సోమవారం ఏలూరు జిల్లా ముసునూరు వద్ద ఏర్పాటు చేసిన ‘గార్మే పాప్‌కార్నికా’ నాన్-జీఎంఓ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం దేశంలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, రైతులపై ఉన్న అభిమానంతో ఉపరాష్ట్రపతి ఏలూరు జిల్లాకు వచ్చి జన్యుమార్పిడి లేని మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. గార్మే పాప్‌కార్న్ సంస్థ దేశీయ నేలపైనే రైతులతో కలిసి నాన్-జీఎంఓ విత్తనాలను ఉత్పత్తి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నూజివీడు ప్రాంతంలో పండుతున్న పాప్‌కార్న్ దేశ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
17,500 మంది రైతులతో 40 వేల ఎకరాల్లో పాప్‌కార్న్ సాగు
గార్మే సంస్థ 17,500 మంది రైతులతో కలిసి సుమారు 40 వేల ఎకరాల్లో పాప్‌కార్న్ సాగు చేస్తూ, దేశీయ పాప్‌కార్న్ ఉత్పత్తిలో 70 శాతం వాటాను కలిగి ఉండటం ప్రశంసనీయమని సీఎం అన్నారు. గతంలో పాప్‌కార్న్ అవసరాల కోసం బ్రెజిల్ వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇకపై ఆర్థిక ప్రయోజనాలు దేశంలోనే నిలిచేలా ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతులను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
‘ఆంధ్రా పాప్‌కార్న్’ ప్రపంచ బ్రాండ్ కావాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రా పాప్‌కార్న్, అరకు కాఫీ, కోస్తా కోకో వంటి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైల్వే స్టేషన్లలో కూడా రాష్ట్రానికి చెందిన ప్రత్యేక ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. కొండపల్లి కొయ్యబొమ్మలు వంటి సంప్రదాయ, స్వదేశీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లు కల్పించాలన్నారు.
పసుపు, మిరప, ఆక్వా ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, ఉద్యాన పంటలకు విలువ జోడించి ఎగుమతులు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 10 శాతం ఉత్పత్తులు మాత్రమే ప్రాసెసింగ్‌కు వెళ్తున్నాయని, ఈ స్థాయిని గణనీయంగా పెంచితే రైతుల ఆదాయం, రాష్ట్ర సంపద రెండూ పెరుగుతాయని అన్నారు.
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలని, ముఖ్యంగా యువత ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్ రంగాలపై దృష్టి సారించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జల భద్రత అత్యంత కీలకమని సీఎం అన్నారు. రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించి సీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీరు అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి పంటలను కాపాడగలిగామని చంద్రబాబు గుర్తుచేశారు. చింతలపూడి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత భవిష్యత్తు మరింత మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నదుల అనుసంధానంతో నీటి భద్రత
దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం జరగాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన అని చంద్రబాబు తెలిపారు. గోదావరి-కృష్ణా, తుంగభద్ర, పెన్నా-కావేరీ నదుల అనుసంధానం ద్వారా నాలుగు రాష్ట్రాల్లో నీటి సమస్యలను గణనీయంగా పరిష్కరించవచ్చని అన్నారు. గంగ, మహానది, గోదావరి నదులను కూడా అనుసంధానిస్తే వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
“నీటి భద్రత సాధిస్తే దేశాభివృద్ధి అన్‌స్టాపబుల్” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కె. అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.









