హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో సోమవారం సాయంత్రం విషాదకర ఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల వివాహిత శీతల్ అపార్ట్‌మెంట్ పై అంతస్తు నుంచి దూకి మృతి చెందారు. ఈ ఘటన కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-6లోని పంచవటి అపార్ట్‌మెంట్స్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. కేరళలోని కన్నూరుకు చెందిన శీతల్‌కు సుమారు ఆరేళ్ల క్రితం పురుషోత్తమన్‌తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త పురుషోత్తమన్ ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తుండగా, శీతల్ అత్తమామలతో కలిసి కేపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తున్నారు.
కొద్దిసేపు మెట్లపై కూర్చుని..
సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో శీతల్ టెర్రస్‌కు వెళ్లే మెట్ల వద్ద దాదాపు 10 నిమిషాల పాటు కూర్చున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఒక్కసారిగా పైకి వెళ్లి అపార్ట్‌మెంట్ ఆవరణలోకి దూకినట్లు సమాచారం.
తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం
శీతల్ కొంతకాలంగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ఆమె భర్త, కేరళలో ఉన్న సోదరుడు పోలీసులకు తెలిపినట్లు ఎస్సై శశిధర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మందులు కూడా ఆమె వాడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పినట్లు తెలిపారు.
అయితే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. శీతల్ మృతిపై కేరళలోని ఆమె తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








