contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏ క్షణంలోనైనా బద్దలయ్యే ప్రమాదం.. కృత్రిమ సరస్సుపై చైనా హెచ్చరిక

కాఠ్మాండు: నేపాల్‌–టిబెట్‌ సరిహద్దులో ఏర్పడిన కృత్రిమ సరస్సు (బ్యారియర్‌ లేక్) మరోసారి ఆందోళనకు కారణమైంది. సరస్సును అడ్డుకుంటున్న సహజ ఆనకట్ట ఏ క్షణంలోనైనా బద్దలయ్యే అవకాశం ఉందని చైనా అధికారులు నేపాల్‌ను అప్రమత్తం చేశారు. గట్టు తెగితే భారీగా వరద నీరు దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

బుధవారం అత్యంత ఎత్తులో ఉన్న ప్రాంతంలో హిమనీనదం కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, బురద దిగువకు కొట్టుకువచ్చాయి. ఇవి నదీ ప్రవాహానికి అడ్డుగా నిలవడంతో సహజ ఆనకట్ట ఏర్పడి భారీగా నీరు నిలిచిపోయింది. ఈ ప్రభావంతో గైరాంగ్‌ సరిహద్దు క్రాసింగ్‌తో పాటు భోటే కోశి, త్రిశూలి నదీ వ్యవస్థ పరిధిలోని ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఈ నేపథ్యంలో నేపాల్‌ విదేశాంగ శాఖకు చైనా అధికారులు సమాచారం అందించారు. సరస్సులోని నీటి రంగు క్రమంగా ముదురు రంగులోకి మారుతోందని, ఇది సహజ ఆనకట్టపై ఒత్తిడి పెరుగుతున్న సంకేతం కావచ్చని పేర్కొన్నారు. శుక్రవారం నాటికి సరస్సులో సుమారు 25 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీరు చేరినట్లు అంచనా వేశారు.

ఆనకట్ట పాక్షికంగా బద్దలైతే సెకనుకు సుమారు 500 క్యూబిక్‌ మీటర్ల వేగంతో నీటి ప్రవాహం ఏర్పడవచ్చని అధికారులు హెచ్చరించారు. అయితే ఈ ప్రవాహం ప్రధానంగా నది గట్ల పరిధిలోనే ఉండే అవకాశం ఉందని తెలిపారు.

అయితే తాజా పరిశీలనల్లో సరస్సు ఉపరితల వైశాల్యం కొంత తగ్గినట్లు చైనా అధికారులు గుర్తించారు. దీంతో తక్షణ వరద ముప్పు కొంత తగ్గిందని వెల్లడించారు. పరిస్థితి కొంత అదుపులోకి రావడంతో తాత్కాలికంగా నిలిపివేసిన సహాయక చర్యలను అధికారులు తిరిగి ప్రారంభించారు.

ప్రస్తుతం డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాల ద్వారా సరస్సు పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా సరస్సుకు ఎగువ ప్రాంతంలో మరో పెద్ద నీటి వనరును గుర్తించినట్లు సమాచారం. దాని కదలికలు, నీటి మట్టాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే ఈ విపత్తు కారణంగా సరిహద్దుకు ఇరువైపులా భారీ ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. వందలాది మంది మృత్యువాత పడగా, వెయ్యి మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణం, మరోసారి వరదలు సంభవించే అవకాశం నేపథ్యంలో సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రకృతి విపత్తు ఎప్పుడు మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :