contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాకినాడ టు టౌన్ ఓవర్ బ్రిడ్జికి శిథిల రైలింగ్‌ ముప్పు

కాకినాడ: నగరంలోని టు టౌన్ ఓవర్ బ్రిడ్జిపై శిథిలావస్థకు చేరిన సిమెంట్ రైలింగ్‌ తీవ్ర ప్రమాదకరంగా మారిందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా రైలింగ్‌ మరమ్మతులపై నిర్లక్ష్యం కొనసాగుతుండటంతో పరిస్థితి రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోందని పేర్కొన్నారు.

బ్రిడ్జిపై పలు ప్రాంతాల్లో సిమెంట్‌ రైలింగ్‌ శిథిలమై ముక్కలు ఊడిపడుతున్నాయని, మరికొన్ని చోట్ల పూర్తిగా విరిగిపోయిన దుస్థితి నెలకొందని రమణ రాజు తెలిపారు. పాదచారులు ప్రమాదవశాత్తు తూలి పడితే సర్వీస్‌ రోడ్డుపై పడే ప్రమాదం ఉందని, అదే విధంగా రైలింగ్‌ శిథిలాలు సర్వీస్‌ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులపై పడితే ప్రాణనష్టం సంభవించే అవకాశముందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు టు టౌన్ ఓవర్ బ్రిడ్జిని స్వయంగా పరిశీలించి, శిథిల రైలింగ్‌ సమస్యకు తక్షణ పరిష్కారం చూపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర రహదారిగా ఉన్న మార్గాన్ని మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుకూలంగా జిల్లా రహదారిగా మార్చడం వల్ల రహదారి నిర్వహణ బాధ్యతలు, నిధుల విషయంలో సమస్యలు ఏర్పడి బ్రిడ్జి నిర్వహణ నిర్లక్ష్యానికి గురైందని రమణ రాజు ఆరోపించారు. దీంతో ప్రజల భద్రతకు సంబంధించిన అంశం కూడా పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

అంతేకాకుండా శిథిలమైన రైలింగ్‌పై అనధికారికంగా భారీ ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేయడం మరింత ఆందోళనకరమని ఆయన అన్నారు. బ్రిడ్జిపై ఉన్న ప్రమాదకర పరిస్థితులు కనిపించకుండా ఫ్లెక్సీలతో కప్పిపుచ్చుతున్నారనే ఆరోపణలు చేశారు.

1975లో నిర్మించిన టు టౌన్ ఓవర్ బ్రిడ్జికి కేవలం 50 ఏళ్లకే నూరేళ్ల నాటి శిథిలావస్థ రావడం శోచనీయమని రమణ రాజు వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, డిప్యూటీ సీఎం తదితర ప్రజాప్రతినిధులు ఈ బ్రిడ్జిపై ప్రయాణించే సమయంలో శిథిలమైన రైలింగ్‌ కనిపించకుండా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలను కూడా ఆయన చేశారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి రైలింగ్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి, ప్రమాదకర ప్రాంతాలను వెంటనే తొలగించి పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రమణ రాజు కోరారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించకపోతే టు టౌన్ ఓవర్ బ్రిడ్జి “షష్టి పూర్తి” వేడుకలు నిర్వహించి, పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రికి ఫొటోలు పంపిస్తామని ఆయన హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :