contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాకినాడ జీజీహెచ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

కాకినాడ: కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తగినన్ని నిధులు, విధులు కేటాయించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఆసుపత్రి అభివృద్ధికి గత ఏడాది సుమారు రూ.5 కోట్ల నిధులు కేటాయించగా, ఈ ఏడాది వాటిని రూ.3 కోట్లకు తగ్గించడం వల్ల పౌర సౌకర్యాలపై ప్రభావం పడుతోందని సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.

జీజీహెచ్‌లో అంతర్గత రహదారుల వంటి సౌకర్యాల కోసం కార్పొరేషన్ నిధులను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వాహనాలతో పాటు రోజూ సుమారు 200 కార్లు, 600 వరకు ద్విచక్ర వాహనాలు ఆసుపత్రి ప్రాంగణంలో పార్కింగ్ అవుతున్నాయని తెలిపారు. దీనికి తోడు జీజీహెచ్ వెలుపల అంబులెన్స్‌లు వరుసగా నిలిపి ఉంచడం వల్ల రోగులు, వారి సహాయకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం

పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆసుపత్రి వెనుక ఉన్న టి.బి. ఆసుపత్రి పక్కన ఉన్న ఆర్టీసీ స్థలాన్ని వినియోగించుకోవాలని రమణరాజు సూచించారు. అక్కడ వాహనాల పార్కింగ్‌కు అవకాశం కల్పించి, పాత బస్టాండ్ రోడ్డుపై రైల్వే స్టేషన్ తరహాలో పాదచారుల వంతెన నిర్మించి ఆసుపత్రి ప్రాంగణంతో అనుసంధానం చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.

చిరు వ్యాపారులకు ప్రణాళికాబద్ధంగా దుకాణాలు

జీజీహెచ్‌కు వచ్చే రోగులు, వారి బంధువుల అవసరాల కోసం చిరు వ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆసుపత్రి వద్ద సుమారు 10 చిన్న దుకాణాలు నిర్మించకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల అనధికారికంగా బడ్డీలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కొందరు మున్సిపాలిటీ, ట్రాన్స్‌కో అధికారులకు వేల రూపాయలు చెల్లించి దళారుల ద్వారా బడ్డీలు ఏర్పాటు చేసుకుంటున్నారని, ఒక్కో బడ్డీకి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. దీనివల్ల ఆసుపత్రి ప్రాంగణం క్రమంగా మార్కెట్ ప్రాంతంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి పర్యటనల సమయంలో చిరు వ్యాపారులను అకస్మాత్తుగా రోడ్లపైకి తరలించడం కాకుండా, ముందస్తు ప్రణాళికతో ఒక వైపు స్థలాన్ని కేటాయించి 4×6 అడుగుల పరిమాణంలో జనతా దుకాణాలు నిర్మించాలని సూచించారు. నిర్మాణ వ్యయం, అద్దెను నిర్ణయించి పారదర్శక విధానంలో దుకాణాలను కేటాయిస్తే చిరు వ్యాపారులకు ఉపాధితో పాటు ఆసుపత్రి అభివృద్ధికి ఆదాయం సమకూరుతుందని అన్నారు.

జీజీహెచ్ అభివృద్ధి కమిటీ ద్వారా కలెక్టర్ సమగ్ర ప్రణాళిక రూపొందించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఆసుపత్రి పరిధిలో కొత్త ఆక్రమణలు జరగకుండా కట్టడి చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :