contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలుగు భాష వైభవాన్ని భావితరాలకు అందించాలి : సీఎం చంద్రబాబు

అమరావతి: తెలుగు భాష గొప్పతనాన్ని భావితరాలకు సజీవంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న మాటల స్ఫూర్తితో తెలుగు భాష, లిపి వైభవాన్ని తరతరాలకు అందించాలని ఆకాంక్షించారు. మాటల్లోనే కాకుండా అక్షరాల్లోనూ తెలుగు భాష గొప్పదనం చిరస్థాయిగా నిలవాలని పేర్కొన్నారు.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలకు చిన్నతనం నుంచే తెలుగు చదవడం, రాయడంపై ఆసక్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అక్షరంపై మమకారం, భాషపై అభిమానం పెంపొందిస్తేనే తెలుగు లిపి భవిష్యత్ తరాల్లోనూ వెలుగొందుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం నాడు విడుదలైన ‘కూల్‌ఫబెట్స్’ (Coolphabets) యాప్‌ను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆటపాటల ద్వారా పిల్లలకు తెలుగు భాషతో పాటు ఇతర భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించేలా యాప్‌ను రూపొందించడం అభినందనీయమని అన్నారు.

యాప్ రూపకర్తలు కొల్లు రంజిత్, వెంకట్ ఏలేటితో పాటు వారి బృందానికి చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను భాషా అభ్యాసానికి వినియోగించిన తీరును ఆయన ప్రశంసించారు.

పిల్లల చేతిరాతను ఏఐ సాంకేతికత ద్వారా పరిశీలించి, దానిని మెరుగుపరుచుకునేందుకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించేలా యాప్‌ను తీర్చిదిద్దడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. సాంకేతికత మన భాషకు దూరం చేయకుండా.. భాషకు మరింత చేరువ చేసే సాధనంగా మారాలని ఆయన సూచించారు.

“మన భాష, మన లిపి, మన సంస్కృతే మన తెలుగు జాతికి అసలైన గుర్తింపు. తేనెలొలికే మన తెలుగు భాష భావితరాల్లోనూ చిరస్థాయిగా వెలుగొందాలి” అని చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగు భాషాభివృద్ధికి ఆధునిక సాంకేతికతను వినియోగించాలన్న ముఖ్యమంత్రి పిలుపుపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :