గోదావరిఖని : ఆర్జీ-2 ఏరియా జీడీకే 8 ఇంక్లైన్ కాలనీలో శుక్రవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో T2-1255 క్వార్టర్‌లో మంటలు చెలరేగడంతో ఇంట్లోని ఫ్రిడ్జ్, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో బాధిత కుటుంబానికి తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లడంతో పెను ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. దీంతో అగ్నిప్రమాదం మరింత విస్తరించకుండా సకాలంలో నివారించారు.
ప్రమాద విషయం తెలుసుకున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాలనీలోని పలు క్వార్టర్లలో సరైన ఎర్తింగ్ లేకపోవడం, MCB, RCCB వంటి విద్యుత్ రక్షణ వ్యవస్థలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలకు అవకాశం ఉందని సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలనీలోని అన్ని క్వార్టర్లలో విద్యుత్ వైరింగ్, ఎర్తింగ్‌తో పాటు MCB, RCCB ట్రిప్పింగ్ వ్యవస్థలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. విద్యుత్ భద్రతలో లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిచేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరింది.
ఇదిలా ఉండగా, సీఐటీయూ నాయకత్వం ప్రమాద విషయాన్ని శనివారం ఉదయమే జనరల్ మేనేజర్, డీజీఎం (సివిల్/పర్సనల్) అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి, టెండర్ల పేరుతో ఆలస్యం చేయకుండా ఫాస్ట్‌ట్రాక్ విధానంలో అదే రోజు బాధిత క్వార్టర్ మరమ్మతు పనులను ప్రారంభించారు.
కార్మిక కుటుంబ సమస్యపై తక్షణమే స్పందించి మరమ్మతు పనులు ప్రారంభించిన జనరల్ మేనేజర్, డీజీఎం, సంబంధిత సివిల్, ఎలక్ట్రికల్ అధికారులకు సీఐటీయూ నాయకులు, కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ సోమరాపు వెంకన్న, నాయకులు శివకుమార్, శ్రావణ్, సుమన్, మల్లేశం, నరేష్, తిరుపతితో పాటు స్థానిక కార్మికులు, కాలనీవాసులు పాల్గొన్నారు.








