కాకినాడ: నగరంలో మురుగు నీరు సక్రమంగా పారేందుకు అవసరమైన మేజర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా సోమవారం గ్రీవెన్స్‌లు నిర్వహించడం, ప్రతిరోజూ మార్నింగ్ విజిట్స్ చేయడం, అధికార పార్టీ కార్యకర్తలతో నెలకు మూడు సమావేశాలు నిర్వహించడం వల్ల నగర ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటని పౌర సంక్షేమ సంఘం ప్రశ్నించింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించడంపైనే కార్పొరేషన్ దృష్టి పెట్టాలని సంఘం సూచించింది.
కొత్తపేట మార్కెట్ వద్ద బ్రిడ్జి దిగువ భాగంలో మురుగు నీరు సక్రమంగా పారకపోవడంతో నిత్యం ముంపు పరిస్థితి కొనసాగుతోందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు ఆరోపించారు. గత పదేళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతోందని, వర్షాలు కురిసిన ప్రతిసారీ బ్రిడ్జి దిగువ ప్రాంతం చెరువును తలపించేలా మారుతోందని తెలిపారు.
పదేళ్ల కాలంలో సుమారు ఎనిమిది మంది కమిషనర్లు మారినా కొత్తపేట మార్కెట్ బ్రిడ్జి కింద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆయన అన్నారు. బ్రిడ్జి దిగువన తగిన వెడల్పుతో, లోతుగా రోడ్డు సెంటర్ డ్రైనేజీ నిర్మించి, దాన్ని రేచర్లపేట రైల్వే గేటు వద్ద ఉన్న మేజర్ డ్రైనేజీకి అనుసంధానం చేస్తే మురుగు ముంపు సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.
పన్నులు పెరుగుతున్నా.. సౌకర్యాలు ఎక్కడ?
మరోవైపు ఆస్తిపన్ను భారం కూడా నగరవాసులపై గణనీయంగా పెరిగిందని రమణ రాజు పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం ఒక ఇంటికి అర్ధ సంవత్సరానికి రూ.10 వేలుగా ఉన్న ఆస్తిపన్ను ప్రస్తుతం రూ.22 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నును ప్రతి ఏటా 15 శాతం పెంచడంతో పాటు రెండుసార్లు భూమి విలువలను పెంచడం వల్ల ఆస్తిపన్ను వసూళ్లు భారీగా పెరిగాయని ఆయన తెలిపారు. మొత్తంగా పన్నుల భారం సుమారు 135 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు.
కార్పొరేషన్ ఎవరి సొమ్మును తెచ్చి నగరంలో పౌర సౌకర్యాలు కల్పించడం లేదని, ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులే ప్రధాన ఆదాయ వనరులని ఆయన అన్నారు. అధికారిక ఆర్థిక నివేదికల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ ఆస్తిపన్ను ఆదాయం రూ.41.98 కోట్లుగా ఉండగా, 2026-27 నాటికి అది రూ.76.30 కోట్లకు పెరిగిందని తెలిపారు.
పన్నులు వసూలు చేస్తున్న స్థాయిలో సౌకర్యాలున్నాయా?
ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని పౌర సంక్షేమ సంఘం విమర్శించింది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న నిధులను పౌర సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కాకినాడ జీజీహెచ్‌లో అంతర్గత రహదారుల నిర్మాణానికి కార్పొరేషన్ నిధులు వినియోగించడంపై కూడా రమణ రాజు ప్రశ్నలు సంధించారు. నగర ప్రజల నుంచి వసూలు చేస్తున్న కార్పొరేషన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించే హక్కు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
40 శాతం వీధి కల్వర్టులు దెబ్బతిన్నాయి
నగరంలోని సుమారు 40 శాతం వీధి కల్వర్టులు దిగబడిపోయి, శిథిలావస్థకు చేరుకున్నాయని రమణ రాజు తెలిపారు. వాటిని గుర్తించి పునర్నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మురుగు పారుదల వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు, శిథిలమైన కల్వర్టులను పునర్నిర్మించడం ద్వారా వర్షాకాలంలో ఏర్పడే ముంపు సమస్యలను కొంతవరకు నివారించవచ్చన్నారు.
నగరంలోని వాస్తవ పరిస్థితులు పాలకులు, ప్రజాప్రతినిధులకు స్పష్టంగా తెలియాలంటే కొత్తపేట మార్కెట్ బ్రిడ్జి దిగువన సమావేశం నిర్వహించాలని రమణ రాజు సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం, సీఎం స్థాయి ప్రజాప్రతినిధులు అక్కడ సమావేశం నిర్వహిస్తే మురుగు దుర్గంధం, ముంపు, ప్రజల అవస్థలు ప్రత్యక్షంగా తెలుస్తాయని అన్నారు.
గ్రీవెన్స్‌లు, సమావేశాలు, మార్నింగ్ విజిట్స్కే పరిమితం కాకుండా నగరానికి అవసరమైన మేజర్ డ్రైనేజీలు, కల్వర్టులు, రోడ్లు వంటి శాశ్వత మౌలిక సదుపాయాలపై కార్పొరేషన్ దృష్టి సారించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.








