contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఫలించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రయత్నం .. పిడుగురాళ్లలో ఆగనున్న ఎంప్లాయిస్ ట్రైన్

పిడుగురాళ్ల : పల్నాడు జిల్లా ప్రజలు, నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. లింగంపల్లి–విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (12795/12796) కు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో స్టాపేజ్‌ మంజూరైంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్‌ 4, 2026 నుంచి ఈ రైలు పిడుగురాళ్లలో ప్రయాణికుల కోసం నిలవనుంది.

పిడుగురాళ్లలో ఈ రైలుకు స్టాపేజ్‌ కల్పించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చేసిన ప్రయత్నం ఫలించింది. పల్నాడు ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన రైల్వే శాఖ ఉన్నతాధికారులతో చేసిన విన్నపాలకు సానుకూల స్పందన లభించింది.

రైలు సమయాలు ఇవే..

ట్రైన్‌ నంబర్‌ 12796 – లింగంపల్లి నుంచి విజయవాడ:
లింగంపల్లిలో ఉదయం 4:40 గంటలకు బయలుదేరే రైలు ఉదయం 8:06 గంటలకు పిడుగురాళ్ల చేరుకుని, ఒక నిమిషం తర్వాత 8:07 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడకు ఉదయం 10:35 గంటలకు చేరుకుంటుంది.

ట్రైన్‌ నంబర్‌ 12795 – విజయవాడ నుంచి లింగంపల్లి:
విజయవాడలో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరే రైలు రాత్రి 7:08 గంటలకు పిడుగురాళ్ల చేరుకుని, 7:09 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. లింగంపల్లికి రాత్రి 11:35 గంటలకు చేరుకుంటుంది.

ఉద్యోగులు, విద్యార్థులకు భారీ ప్రయోజనం

ఇప్పటివరకు పిడుగురాళ్లలో ఈ రైలుకు స్టాపేజ్‌ లేకపోవడంతో హైదరాబాద్‌, విజయవాడ వైపు నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం హైదరాబాద్‌ వైపు, సాయంత్రం విజయవాడ వైపు ప్రయాణించే వారికి ఈ రైలు స్టాపేజ్‌ ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

పిడుగురాళ్లతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం, వ్యయభారం తగ్గే అవకాశం ఉంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే స్టాపేజ్‌ మంజూరు కావడంపై పల్నాడు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని పిడుగురాళ్లలో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ స్టాపేజ్‌కు అనుమతి ఇచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, సంబంధిత రైల్వే శాఖకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైలు సౌకర్యాన్ని పల్నాడు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :