మార్కాపురం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మార్కాపురం వస్తున్న నేపథ్యంలో, పట్టణంలోని సిపిఎం కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కమ్యూనిస్టు నాయకులు నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా చూసేందుకు తెల్లవారుజామున 5 గంటల నుంచే పోలీసులు సిపిఎం నాయకులను గృహనిర్బంధం చేశారు. కార్యాలయం చుట్టూ గట్టి పోలీస్ పహారా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. వెలుగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయంటే అది కమ్యూనిస్టుల నిరంతర పోరాటాల ఫలితమేనని స్పష్టం చేశారు. గత 30 ఏళ్లుగా పాలక పార్టీలు ఈ ప్రాజెక్టును నాన్చుతూ వచ్చాయని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం, నిర్వాసితులకు న్యాయమైన పరిహారం, పునరావాసం దక్కడం కోసం సిపిఎం అనేక ఉద్యమాలను నడిపిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు సాధన కోసం కేసులు, జైలు శిక్షలను సైతం లెక్కచేయకుండా తాము పోరాడామని తెలిపారు.అలాంటి ప్రజా సమస్యలపై పోరాడిన నాయకులను ముఖ్యమంత్రి పర్యటన సాకుతో తెల్లవారుజాము నుంచే నిర్బంధించడం దుర్మార్గామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు సిపిఎం తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.








