చేగుంట : రాష్ట్ర ప్రభుత్వం మే 21న విడుదల చేసిన జీవో నంబర్ 6 ప్రకారం పెంచిన కనీస వేతనాలను జూన్ 1 నుంచి అమలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని నాన్ రెగ్యులర్ కార్మికుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ డిమాండ్ చేశారు.
ఆదివారం చేగుంట క్లస్టర్ కేంద్రంలో కనీస వేతనాల అమలును కోరుతూ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు 10–15 ఏళ్లుగా కనీస వేతనాలను సవరించకపోవడంతో పెరిగిన ధరలకు అనుగుణంగా ఆదాయం లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస వేతనాల పెంపు కోసం స్వతంత్రంగా, ఇతర కార్మిక సంఘాలతో కలిసి అనేక పోరాటాలు, ఆందోళనలు నిర్వహించినట్లు తెలిపారు. 2014 నుంచి గత ప్రభుత్వం మూడు సార్లు కనీస వేతనాల సలహా మండలిని నియమించినప్పటికీ, కార్మికుల వేతనాలను మాత్రం పెంచలేదని విమర్శించారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 78 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాలను పెంచుతూ మే 21న జీవో జారీ చేసిందని, అయితే కనీస వేతనాల సలహా మండలి సిఫార్సులు, శాస్త్రీయ విధానాలను పరిగణనలోకి తీసుకోకుండా వేతనాలను నిర్ణయించడం సరికాదని రమేష్ అన్నారు.
మూడు జోన్ల విధానం కార్మికులకు నష్టదాయకం
ప్రభుత్వం కొత్తగా వేతనాలను మూడు జోన్లుగా విభజించి, కార్మికులను అన్‌స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించిందని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో ఒకే విధానంలో వేతనాలను నిర్ణయించడం వల్ల గతంలో వివిధ షెడ్యూల్డ్ ఎంప్లాయ్‌మెంట్లలో పనికి అనుగుణంగా వేర్వేరుగా చెల్లించే వేతన విధానం దెబ్బతింటుందని అన్నారు.
1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ అక్ఱాయిడ్ ఫార్ములా, 2016లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శాస్త్రీయంగా వేతనాలను లెక్కిస్తే నెలకు కనీస వేతనం రూ.32 వేల వరకు ఉండాలని రమేష్ పేర్కొన్నారు. అయితే కనీసం రూ.26 వేల వేతనం చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం అందుకు అనుగుణంగా వేతనాలను నిర్ణయించలేదని విమర్శించారు.
యాజమాన్యాలకు లాభం.. కార్మికులకు నష్టం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కార్మికులకు నష్టం వాటిల్లుతుందని, యాజమాన్యాలకు కోట్లాది రూపాయల ప్రయోజనం కలుగుతుందని రమేష్ ఆరోపించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కార్మికులకు సుమారు 60 శాతం మేర వేతనాల పెంపు అమలు చేస్తుండగా, తెలంగాణలో మాత్రం నామమాత్రంగా 30 శాతం మాత్రమే పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు.
పెద్ద ఫార్మా, కెమికల్స్ పరిశ్రమల్లోనూ కాంట్రాక్టు విధానం పేరుతో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అండదండలతో యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని విమర్శించారు.
మే 21న ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు జిల్లాలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.14,000, సెమీస్కిల్డ్ వారికి రూ.15,000, స్కిల్డ్ వారికి రూ.16,500, హైస్కిల్డ్ కార్మికులకు రూ.18,000గా వేతనాలు నిర్ణయించారని వివరించారు.
రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి నెలకు కనీసం రూ.26 వేల వేతనం నిర్ణయించి అమలు చేయాలని కూరపాటి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (వీడీఏ)ను ప్రతి పాయింట్‌కు రూ.12గా నిర్ణయించాలని కోరారు.
ప్రభుత్వం ప్రకటించిన మూడు జోన్ల విధానాన్ని రద్దు చేయాలని, జీవో నంబర్ 6లో పేర్కొన్న వేతనాలకు అదనంగా 10 శాతం పెంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ, వారాంతపు సెలవులు, ఇతర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
పరిశ్రమల్లో కనీస వసతులు కల్పించడంతో పాటు కార్మికుల శ్రమను దోచుకుంటున్న యాజమాన్యాలపై లేబర్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, వివిధ పరిశ్రమలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.








