కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్: మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురిని బెజ్జూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం 41 పశువులను స్వాధీనం చేసుకున్నట్లు బెజ్జూర్ ఎస్సై ఎం.డి. సర్తాజ్ పాషా తెలిపారు.
శనివారం సాయంత్రం సుస్మీర్ గ్రామ శివారులో పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టి పశువులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు.
తనిఖీల్లో 10 ఎద్దులు, 21 ఆవులు, 10 దూడలు.. మొత్తం 41 పశువులు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పశువులను మహారాష్ట్రలో తక్కువ ధరకు కొనుగోలు చేసి జగిత్యాల మార్కెట్లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు నిందితులు ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
పశువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై ఎం.డి. సర్తాజ్ పాషా తెలిపారు.








